Post your question

 

    Asked By: సోమశేఖర్‌

    Ans:

    మీరు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ని సంప్రదాయ యూనివర్సిటీలో చదివినా, ఓపెన్‌ యూనివర్సిటీలో చదివినా, నిర్థారిత మార్కుల శాతం పొందినట్లైతే నిరభ్యంతరంగా నెట్‌/ సెట్‌ రాయవచ్చు. నెట్‌ రాయడానికి వయసుపరంగా గరిష్ఠ పరిమితి కూడా లేదు. నెట్‌లో ఉత్తీర్ణత పొందేవరకు ఎన్నిసార్లు అయినా రాస్తూనే ఉండొచ్చు. ఇటీవల యూజీసీ జారీ చేసిన నిబంధనల ప్రకారం పీహెచ్‌డీ చేయాలంటే కచ్చితంగా నెట్‌లో మెరుగైన మార్కులు పొందాలి. సాధారణంగా ఏదైనా ఉద్యోగం చేసేవారు దూరవిద్య/ ఓపెన్‌ యూనివర్శిటీ ద్వారా పీజీ చేసే ప్రయత్నం చేస్తారు. మీరు ఎలాంటి ఉద్యోగం చేయకుండా పీజీ చేయాలనుకుంటే రెగ్యులర్‌ విధానంలో చేయండి. రెగ్యులర్‌ విధానంలో పీజీ చదివితే నెట్, సెట్, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగాలకు అవసరమయ్యే విషయ పరిజ్ఞానం పొందే అవకాశం ఉంది. రెగ్యులర్‌ డిగ్రీలకూ.. దూరవిద్య/ ఓపెన్‌ యూనివర్శిటీ డిగ్రీలకూ యూజీసీ పరంగా గుర్తింపులో ఎలాంటి తేడా లేదు. అయినప్పటికీ కొన్ని ప్రముఖ యూనివర్శిటీలు పీహెచ్‌డీ ప్రవేశాల్లో, అధ్యాపక నియామకాల్లో రెగ్యులర్‌ పీజీ చేసినవారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇతర దేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి కూడా రెగ్యులర్‌ విధానంలో పీజీ చేయడం శ్రేయస్కరం. ఒకవేళ రెగ్యులర్‌ విధానంలో పీజీ చేసే అవకాశం లేకపోతే ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా పీజీ చేసి, రెగ్యులర్‌ విధానంలో చదివినవారితో పోటీ పడగలిగే విధంగా విషయ పరిజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 
     

    Asked By: రుక్మిణి

    Ans:

    యూజీసీ నెట్‌ జేఆర్‌ఎఫ్‌కు ఎంపికవ్వాలంటే ముందుగా ఎన్‌టీఏ వారు నిర్వహించే యూజీసీ నెట్‌ జేఆర్‌ఎఫ్‌కు సంబంధించిన రెండు పరీక్షల్లో కలిపి కనీసం 40% (రిజర్వేషన్‌ కేటగిరీలకు 35%) మార్కులు పొంది ఉండాలి. యూజీసీ నెట్‌ పరీక్ష రాసినవారిలో 6% మందికి మాత్రమే యూజీసీ నెట్‌ (అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌) అర్హత లభిస్తుంది. ఈ 6% మందిలో భారత ప్రభుత్వ నిబంధనల మేరకు వివిధ రిజర్వేషన్‌ కేటగిరీలకు ఖాళీలను కేటాయిస్తారు. నెట్, జేెఆర్‌ఎఫ్‌ల సంఖ్యను సబ్జెక్టులవారీగా కూడా కేటాయిస్తారు. ఉదాహరణకు- మేనేజ్‌మెంట్‌ సబ్జెక్ట్‌లో ఎస్సీ కేటగిరీలో నెట్‌ అర్హత పొందేవారి సంఖ్యను కనుక్కోవాలంటే, ఎస్సీ కేటగిరీలో మేనేజ్‌మెంట్‌ సబ్జెక్ట్‌లో రెండు పేపర్లలో కలిపి 35% మార్కులు పొందినవారి సంఖ్యను పైన పేర్కొన్న 6% మందిలో ఎస్సీ కేటగిరీకి కేటాయించిన సంఖ్యతో గుణించి, అన్ని సబ్జెక్టుల్లో రెండు పేపర్లలో కనీసం 35% మార్కులు పొందిన ఎస్సీ కేటగిరికి చెందినవారి మొత్తం సంఖ్యతో భాగించాలి.
    జేఆర్‌ఎఫ్‌ విషయానికొస్తే.. యూజీసీ నెట్‌ పరీక్ష రాసిన వారిలో గరిష్ఠంగా 1% మందికి మాత్రమే యూజీసీ జేెఆర్‌ఎఫ్‌ అర్హత లభిస్తుంది. ఈ 1% మందిలో భారత ప్రభుత్వ నిబంధనల మేరకు వివిధ రిజర్వేషన్‌ కేటగిరీలకు ఖాళీలను కేటాయిస్తారు. ఉదాహరణకు ఇంగ్లిష్‌ సబ్జెక్టులో ఎస్టీ కేటగిరీలో జేెఆర్‌ఎఫ్‌ అర్హత పొందేవారి సంఖ్యను కనుక్కోవాలంటే, ఎస్టీ కేటగిరీలో ఇంగ్లిష్‌లో జేఆర్‌ఎఫ్‌ని ఎంచుకొన్నవారిలో నెట్‌కి అర్హత సంబంధించిన వారి సంఖ్యను ఎస్టీ కేటగిరీకి కేటాయించిన మొత్తం జేెఆర్‌ఎఫ్‌ ఖాళీల సంఖ్యతో గుణించి ఎస్టీ కేటగిరీలో జేఆర్‌ఎఫ్‌ని ఎంచుకొన్నవారిలో నెట్‌కి అర్హత సంబంధించిన వారి సంఖ్యతో భాగించాలి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎన్‌. అశోక్‌

    Ans:

    సీఎస్‌ఐఆర్‌ / యూజీసీ నెట్‌ (లైఫ్‌సైన్సెస్‌) పరీక్ష కోసం ఎకాలజీ (పీటర్‌ స్టిలింగ్‌), ప్లాంట్‌ ఫిజియాలజీ (టైజ్, జైగర్‌), మాలిక్యులర్‌ అండ్‌ సెల్‌ బయాలజీ (హార్వే లోడిష్‌), జెనెటిక్స్‌ (బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌), మాలిక్యులర్‌ బయాలజీ (కార్ప్స్‌), ఇమ్యునాలజీ (ఇవాన్‌ రోట్టిస్‌), ఇమ్యునాలజీ (క్యూబీ), బయోకెమిస్ట్రీ (లెహింగర్‌), బయోకెమిస్ట్రీ (వోట్‌), బయోకెమిస్ట్రీ (స్ట్రైయర్‌), డెవలప్‌మెంటల్‌ బయాలజీ (గిల్బర్ట్‌) పుస్తకాలను చదవండి. గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను సేకరించి ప్రశ్నపత్ర నమూనాను పూర్తిగా అర్థం చేసుకోండి. ప్రతి విభాగానికీ నిర్దిష్ట సంఖ్యలో ఇచ్చిన ప్రశ్నలన్నింటినీ అధ్యయనం చేయండి. పైన చెప్పిన పుస్తకాల నుంచి ఆసక్తి ఉన్న విభాగాల్లో మాదిరి ప్రశ్నలు, సమాధానాలు తయారుచేసుకొని ఒక ప్రణాళిక ప్రకారం సంసిద్ధులు కండి. రుణాత్మక మార్కులుంటాయి కాబట్టి కచ్చితంగా జవాబులు తెలిసిన ప్రశ్నలనే రాయండి.సీఎస్‌ఐఆర్‌ / యూజీసీ నెట్‌కు రోజుకు 6 గంటలు చొప్పున కనీసం 6నెలలు నిరాటంకంగా చదివితే అనుకూల ఫలితం సొంతమవుతుంది.- ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌